Hyderabad: హైదరాబాద్‌లోని బోరబండ ప్రాంతంలో హిజ్రాల మధ్య తలెత్తిన గ్రూపు వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఒక హిజ్రా తమపై తప్పుడు కేసులు పెడుతూ.. వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ మరికొందరు హిజ్రాలు సోమవారం నడిరోడ్డుపై ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో.. పరిస్థితి అదుపు తప్పి కొందరు హిజ్రాలు తమ నిరసనను వ్యక్తం చేస్తూ పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నారు.
ఈ దారుణ ఘటనలో ముగ్గురు హిజ్రాలు తీవ్రంగా గాయపడ్డారు. వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఈ ఆందోళన కారణంగా బోరబండ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ (Traffic Jam) ఏర్పడి.. ప్రజలు ఇబ్బందులు పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని.. ఆందోళనకారులను సముదాయించి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.
Hyderabad: సామాన్యులపై హిజ్రాల వేధింపులు..
Hyderabad: కేవలం అంతర్గత కలహాలు మాత్రమే కాకుండా.. ఇటీవల కాలంలో సామాన్య ప్రజలపై హిజ్రాల వేధింపులు, దాడులు పెరగడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇటీవలే మేడ్చల్ జిల్లాలో సదానందం అనే వ్యక్తి తన కొత్త ఇంట్లోకి పాలు పొంగించడానికి వెళ్లగా.. హిజ్రాల గుంపు అతనిపై దాడి చేసింది. వారు రూ. లక్ష వరకు డబ్బు డిమాండ్ చేశారు. డబ్బు ఇవ్వడానికి నిరాకరించడంతో.. వారు బూతులు తిట్టడమే కాకుండా.. బట్టలు విప్పి ప్రైవేట్ పార్ట్స్ చూపించి బెదిరించారు. చివరకు 15 నుంచి 20 మంది హిజ్రాలు గుంపుగా వచ్చి రాళ్లు, కర్రలతో దాడి చేశారని బాధితుడు ఫిర్యాదు చేశాడు.
నగరంలో ఏ ఫంక్షన్ హాల్ (Function Hall) వద్ద పెళ్లిళ్లు లేదా ఇతర శుభకార్యాలు జరిగినా, హిజ్రాల గుంపులు అక్కడికి చేరుకుని బలవంతంగా డబ్బులు డిమాండ్ చేస్తున్నాయి. వారు డిమాండ్ చేసినంత డబ్బు ఇవ్వకపోతే.. ఇబ్బందికరంగా ప్రవర్తిస్తూ, శుభకార్యానికి ఆటంకం కలిగిస్తున్నారు. సామాన్య ప్రజలను బెదిరించి.. డబ్బు వసూలు చేస్తున్న ఈ ధోరణిపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేదంటే శాంతిభద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ప్రజలు కోరుతున్నారు.
