T20 World Cup: భారత్, శ్రీలంక వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్ 2026లో వెస్టిండీస్ జట్టు తమ విజయ పరంపరను కొనసాగిస్తోంది. బుధవారం ముంబైలోని చారిత్రక వాంఖడే స్టేడియంలో జరిగిన గ్రూప్-సి పోరులో వెస్టిండీస్ 30 పరుగుల తేడాతో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్‌ను చిత్తు చేసింది. ఈ విజయంతో కరేబియన్ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకోవడమే కాకుండా, పదేళ్ల తర్వాత ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌పై విజయం సాధించి పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంది.
రూథర్‌ఫోర్డ్ విధ్వంసం.. భారీ స్కోరు
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ ఆరంభంలోనే షాయ్ హోప్ (0), బ్రాండన్ కింగ్ (1) వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ జట్టును షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ ఆదుకున్నాడు. రూథర్‌ఫోర్డ్ కేవలం 42 బంతుల్లో 7 సిక్సర్లు, 4 ఫోర్లతో అజేయంగా 76 పరుగులు చేసి ఇంగ్లాండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. రోస్టన్ చేజ్ (34), జేసన్ హోల్డర్ (33 నాటౌట్) కీలక సహకారం అందించారు. ఇంగ్లాండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్, జేమీ ఓవర్టన్ రెండేసి వికెట్లు పడగొట్టారు.
స్పిన్ ఉచ్చులో చిక్కుకున్న ఇంగ్లాండ్
T20 World Cup: 197 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌కు ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ (30) మెరుపు ఆరంభాన్ని ఇచ్చాడు. అయితే వెస్టిండీస్ స్పిన్నర్ గుడకేశ్ మోతీ (3/24) రంగంలోకి దిగడంతో ఆట మలుపు తిరిగింది. మోతీ తన స్పిన్ మాయాజాలంతో ఇంగ్లాండ్ మిడిలార్డర్‌ను దెబ్బతీశాడు. సామ్ కర్రన్ (43) ఒంటరి పోరాటం చేసినప్పటికీ, అతనికి ఇతర బ్యాటర్ల నుంచి మద్దతు లభించలేదు. చివరకు ఇంగ్లాండ్ 18.5 ఓవర్లలో 166 పరుగులకే కుప్పకూలింది. వెస్టిండీస్ బౌలర్లలో రోస్టన్ చేజ్ 2 వికెట్లు తీయగా, అకీల్ హుస్సేన్, షమర్ జోసెఫ్ తలా ఒక వికెట్ సాధించారు.
పాయింట్ల పట్టికలో అగ్రస్థానం
ఈ విజయంతో వెస్టిండీస్ ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ నెగ్గి 4 పాయింట్లతో గ్రూప్-సిలో అగ్రస్థానంలో నిలిచింది. స్కాట్లాండ్, ఇంగ్లాండ్ చెరో రెండు పాయింట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 2016 ప్రపంచకప్ ఫైనల్ తర్వాత ఇంగ్లాండ్‌పై వెస్టిండీస్ సాధించిన అతిపెద్ద విజయం ఇదే కావడం విశేషం.
