Kavitha Party: మున్సిపల్ ఎన్నికల్లో కవిత మార్క్.. వడ్డేపల్లి మున్సిపాలిటీని కైవసం చేసుకున్న ‘సింహం’ అభ్యర్థులు!

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కల్వకుంట్ల కవిత మద్దతుదారులు బోణి కొట్టారు. జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీలోని 10 వార్డుల్లో 8 వార్డులను ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (కవిత మద్దతుదారులు) కైవసం చేసుకుంది. ఈ విజయం ఆమె రాజకీయ పునరేకీకరణకు తొలి మెట్టుగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

Kavitha Party: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన రాజకీయ ప్రస్థానంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. జోగులాంబ గద్వాల జిల్లాలోని వడ్డేపల్లి మున్సిపాలిటీని కవిత మద్దతుదారులు ఘనవిజయంతో కైవసం చేసుకున్నారు. ఇక్కడ ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులను వెనక్కి నెట్టి కవిత మద్దతుదారులు స్పష్టమైన మెజారిటీ సాధించడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.

 ‘సింహం’ అభ్యర్థులు క్లీన్ స్వీప్..

వడ్డేపల్లి మున్సిపాలిటీలో మొత్తం 10 వార్డులు ఉండగా, కవిత మద్దతుదారులు ఏకంగా 8 వార్డుల్లో జయకేతనం ఎగురవేశారు. మిగిలిన రెండు స్థానాల్లో అధికార కాంగ్రెస్ ఒకటి, బీఆర్ఎస్ ఒక వార్డును దక్కించుకున్నాయి. ఈ ఎన్నికల్లో కవిత నేరుగా కాకుండా, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీతో జతకట్టి తన అనుచరులను బరిలోకి దింపారు. ‘సింహం’ గుర్తుపై పోటీ చేసిన కవిత మద్దతుదారులు భారీ మెజారిటీతో విజయం సాధించి, మున్సిపల్ పీఠాన్ని దక్కించుకున్నారు.

Kavitha Party: వ్యూహం ఫలించింది.. సొంత పార్టీ దిశగా అడుగులు

బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కవిత తెలంగాణ జాగృతి వేదికగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. త్వరలోనే ఆమె సొంతంగా ఒక రాజకీయ పార్టీని స్థాపించబోతున్నట్లు ప్రచారం జరుగుతున్న తరుణంలో ఈ ఫలితాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ సమయానికి తన పార్టీ సిద్ధంగా లేకపోవడంతో, ఫార్వర్డ్ బ్లాక్ గుర్తును ఉపయోగించుకుని తన బలాన్ని నిరూపించుకున్నారు. క్షేత్రస్థాయిలో కవితకు ఉన్న ఆదరణ, వడ్డేపల్లి ప్రాంతానికి చెందిన కీలక నేత వడ్డేపల్లి శ్రీనన్న కవితకు మద్దతు తెలపడం ఈ విజయానికి ప్రధాన కారణాలని విశ్లేషకులు భావిస్తున్నారు.

సంబరాల్లో మద్దతుదారులు

ఫలితాలు వెలువడగానే వడ్డేపల్లిలో పండగ వాతావరణం నెలకొంది. కవిత మద్దతుదారులు, విజయం సాధించిన అభ్యర్థులు బాణసంచా కాలుస్తూ, మిఠాయిలు పంచుకుంటూ సంబరాలు చేసుకున్నారు. “ఇది క్షేత్రస్థాయిలో మేము చేసిన సేవా కార్యక్రమాలకు లభించిన గుర్తింపు. కవితమ్మ నాయకత్వంపై ప్రజలకున్న నమ్మకమే ఈ విజయం” అని గెలిచిన అభ్యర్థులు వ్యాఖ్యానించారు.

రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల కాంగ్రెస్ హవా కొనసాగినప్పటికీ, వడ్డేపల్లిలో మాత్రం కవిత మద్దతుదారులు ఏకపక్షంగా గెలవడం ఆమె రాజకీయ భవిష్యత్తుకు బలమైన పునాదిగా కనిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *