ఖేలో ఇండియా గేమ్స్‌ నిర్వహణకు పకడ్బందీ కార్యాచరణ

– గ్రామీణ స్థాయి నుంచే ప్రతిభావంతులైన క్రీడాకారుల గుర్తింపు

– రాష్ట్ర మంత్రివర్యులు వాకిటి శ్రీహరి

– డిసెంబర్‌ 11 నుంచి 22 వరకు తెలంగాణలో ఖేలో ఇండియా పోటీలు..

– ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం

– 27 క్రీడాంశాల్లో ప్రతిభావంతుల ఎంపిక..

– క్రీడాకారులకు మెరుగైన శిక్షణ, పోషకాహారంఅందించడంపై ప్రత్యేక దృష్టి

హైదరాబాద్‌, అక్టోబర్ 23 (జన ఉదయం ప్రతినిధి)

తెలంగాణలో డిసెంబర్‌ 11 నుంచి 22 వరకు నిర్వహించనున్న ఖేలో ఇండియా గేమ్స్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ కార్యాచరణతో ముందుకు సాగుతోందని రాష్ట్ర పశుసంవర్ధక, పాడిపారిశ్రామికాభివృద్ధి, మత్స్య, యువజన సర్వీసులు & క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. ఖేలో ఇండియా పోటీల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు, క్రీడాకారుల ఎంపిక, స్టేడియాల సిద్ధత, శిక్షణ తదితర అంశాలపై శుక్రవారం సచివాలయంలో మంత్రి సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ….తెలంగాణలో ఖేలో ఇండియా గేమ్స్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు. దేశవ్యాప్తంగా వచ్చే క్రీడాకారులు, కోచ్‌లు, ప్రతినిధులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

గ్రామీణ స్థాయి నుంచే క్రీడా ప్రతిభకు ప్రోత్సాహం-మంత్రి వాకిటి శ్రీహరి…

రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసి, జాతీయ స్థాయిలో రాణించేలా క్రీడాకారులను తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. 27 రకాల క్రీడాంశాల్లో 1:4, 1:2, 1:1 నిష్పత్తుల ఆధారంగా క్రీడాకారులను దశలవారీగా గుర్తించి, అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారిని ఖేలో ఇండియా పోటీలకు సిద్ధం చేయాలని సూచించారు.

క్రీడాకారుల ఎంపికలో పారదర్శకతకు ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రతిభ ఆధారంగానే అవకాశాలు కల్పించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. కేవలం పోటీల నిర్వహణకే పరిమితం కాకుండా, తెలంగాణ క్రీడాకారులు జాతీయ స్థాయిలో పతకాలు సాధించేలా దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకు సాగాలని తెలిపారు.

“స్టేడియాల సిద్ధత.. క్రీడాకారులకు పోషకాహారం-మంత్రి వాకిటి శ్రీహరి”

ఖేలో ఇండియా పోటీలు నిర్వహించే క్రీడా వేదికలు, స్టేడియాలను గుర్తించి, వాటిలో అవసరమైన మౌలిక సదుపాయాలు, క్రీడా పరికరాలు, ఇతర ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. పోటీల నిర్వహణకు సంబంధించి ప్రతి అంశంపై ప్రత్యేక దృష్టి సారించి, అధికారులకు బాధ్యతలు అప్పగించాలని సూచించారు.

క్రీడాకారుల శారీరక దృఢత్వం, సామర్థ్యం పెంపొందించేందుకు నాణ్యమైన శిక్షణతోపాటు పోషకాలు సమృద్ధిగా ఉండే ఆహారాన్ని ప్రభుత్వ పరంగా అందించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. క్రీడాకారులకు అవసరమైన శిక్షణ, వైద్య సహాయం, వసతి, రవాణా వంటి సదుపాయాల కల్పనపై కూడా ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.

“దేశానికే ఆదర్శంగా ఖేలో ఇండియా నిర్వహణ-మంత్రి శ్రీహరి”

తెలంగాణలో నిర్వహించనున్న ఖేలో ఇండియా గేమ్స్‌ దేశానికే దిక్సూచిగా నిలిచేలా ఏర్పాట్లు ఉండాలని మంత్రి వాకిటి శ్రీహరి ఆకాంక్షించారు. క్రీడాకారులకు అత్యుత్తమ వసతులు కల్పిస్తూ, పోటీల నిర్వహణలో ఎక్కడా లోపాలు లేకుండా ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని చెప్పారు. ఈ పోటీలు తెలంగాణ క్రీడా రంగానికి కొత్త దిశానిర్దేశం చేయడంతోపాటు రాష్ట్ర యువతలో క్రీడల పట్ల ఆసక్తిని మరింత పెంచేలా ఉండాలని పేర్కొన్నారు.

సమీక్షా సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ క్రీడల సలహాదారు, తెలంగాణ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఏపీ జితేందర్‌ రెడ్డి, రాష్ట్ర స్పోర్ట్స్‌ అథారిటీ చైర్మన్‌ శివసేనారెడ్డి, వైస్‌ చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సోని బాలాదేవి, తెలంగాణ ఒలింపిక్‌ అసోసియేషన్‌ కార్యదర్శి మల్లారెడ్డి, ప్రవీణ్‌ కుమార్‌ మల్లారెడ్డి, డిప్యూటీ డైరెక్టర్లు రవీందర్‌, రవితేజ, అశోక్‌, శ్రీనివాస్‌, ఇంజినీర్‌ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error

జన ఉదయం మరింత మందికి చేర్చండి.