T20 World Cup 2026: ముంబైలోని వాంఖడే స్టేడియం 2026 టీ20 ప్రపంచ కప్ రెండో రోజున ఉత్కంఠభరితమైన మ్యాచ్‌కు వేదికగా నిలిచింది. ఈ పోరులో ఇంగ్లాండ్, నేపాల్ జట్లు తలపడగా.. చివరి ఓవర్లో నిర్ణయం తేలింది. బలమైన ఇంగ్లాండ్‌ను చివరి బంతి వరకు ఒత్తిడిలో ఉంచిన నేపాల్, 4 పరుగుల తేడాతో వీరోచిత ఓటమిని ఎదుర్కొంది.
టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. ఆరంభంలో నేపాల్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఇంగ్లాండ్ పరుగులు నెమ్మదిగా వచ్చాయి. ఈ సమయంలో జాకబ్ బెథెల్ జట్టుకు కీలక ఇన్నింగ్స్ అందించాడు. అతడు 35 బంతుల్లో 55 పరుగులు చేసి స్కోరును ముందుకు నడిపించాడు. కెప్టెన్ హ్యారీ బ్రూక్ కూడా బాధ్యతాయుతంగా ఆడి 32 బంతుల్లో 53 పరుగులు చేశాడు.
ఇన్నింగ్స్ చివరి దశలో విల్ జాక్స్ బ్యాట్ పట్టాడు. అతడు అజేయంగా 39 పరుగులు చేసి ఇంగ్లాండ్‌కు బలమైన స్కోరు అందించాడు. ముఖ్యంగా 20వ ఓవర్ చివరి బంతికి కొట్టిన సిక్స్ మ్యాచ్ ఫలితాన్ని ఇంగ్లాండ్ వైపు తిప్పింది. నేపాల్ బౌలింగ్‌లో దీపేంద్ర సింగ్ ఐరి, నందన్ యాదవ్ తలా రెండు వికెట్లు తీసుకోగా, షేర్ మల్లా, సందీప్ లామిచానే ఒక్కో వికెట్ సాధించారు.
T20 World Cup 2026: 185 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నేపాల్ అద్భుత ఆరంభం అందుకుంది. ఓపెనర్లు కుశాల్ భూర్తెల్ 29 పరుగులు, దీపేంద్ర సింగ్ ఐరి 44 పరుగులతో ఇంగ్లాండ్ బౌలర్లపై ఒత్తిడి పెంచారు. మధ్యలో కెప్టెన్ రోహిత్ పౌడెల్ 39 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. క్రమంగా వికెట్లు పడుతున్నా.. చివరి వరకు మ్యాచ్‌ను తీసుకెళ్లాలనే పట్టుదల నేపాల్ ఆటగాళ్లలో కనిపించింది.
చివరి ఓవర్లో గెలవడానికి 10 పరుగులు అవసరం కాగా, లోకేష్ బామ్ అజేయంగా 20 బంతుల్లో 39 పరుగులు చేసినప్పటికీ, జట్టును గెలిపించలేకపోయాడు. నేపాల్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 180 పరుగులు మాత్రమే చేసి, 4 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఓటమి ఎదురైనా, నేపాల్ ప్రదర్శన క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంది. ఇంగ్లాండ్ ఆటగాళ్ల ముఖాల్లో చివరి బంతి వరకు ఓటమి భయం కనిపించడం ఈ మ్యాచ్ ప్రత్యేకతగా నిలిచింది.
