ప్రజా ప్రభుత్వానికి 1000 రోజులు … మక్తల్ లో ఘనంగా సంబురాలు..

– మంత్రి వాకిటి శ్రీహరి ఆధ్వర్యంలో అభివృద్ధి పరుగులు పెడుతోందని కొనియాడిన నేతలు…

నారాయణపేట, సెప్టెంబర్ 2 (జన ఉదయం ప్రతినిధి)

కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రజల మన్ననలతో 1000 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా బుధవారం మక్తల్ పట్టణంలో… టౌన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా సంబరాలు నిర్వహించారు. తొలుత అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ..

1000 రోజుల్లో రైతు సంక్షేమం, పేదల భరోసా, యువతకు ఉద్యోగాలు, విద్య, సామాజిక న్యాయానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. రూ.2 లక్షల వరకు పంట రుణమాఫీ, రైతు భరోసా పెంపు, గృహజ్యోతి, రూ.500కే గ్యాస్ సిలిండర్, 70 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ వంటి నిర్ణయాలు ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చాయన్నారు.

బీసీ కులగణన, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ ద్వారా సామాజిక న్యాయానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు.

మక్తల్ నియోజకవర్గం లో మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి ఆధ్వర్యంలో ఊహించని రీతిలో అభివృద్ధి పరుగులు పెడుతోందని అన్నారు. సంగం బండ బండరాయి పగలగొట్టడంతో పాటు… మక్తల్ లో కోర్టు ఏర్పాటు, డిగ్రీ కళాశాల, డయాలసిస్ సెంటర్, మహిళలకు సెట్విన్ ఏర్పాటు చేశారని అన్నారు. 150 పడకల ఆసుపత్రి పనులు చివరి దశకు వచ్చాయని, ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులు జోరుగా సాగుతున్నాయని తెలిపారు. ఆత్మకూరు వద్ద కృష్ణానది మీదుగా గద్వాలకు కొత్త బ్రిడ్జి ఏర్పాటుతో ఆ ప్రాంత రూపురేఖలే మారబోతున్నాయని చెప్పారు. చిట్యాల వాగు వద్ద బ్రిడ్జి, మల్లెపల్లి, గోలపల్లి, మంథన్ గోడ్, చిన్న పొర్ల గ్రామాల వద్ద కల్వర్టు పనులు పూర్తయ్యాయని అన్నారు. మున్సిపాలిటీలలో సిసి రోడ్లు గతంలో ఎన్నడూ లేనంతగా మంజూరయ్యాయని, బీటీ రోడ్లు లేని గ్రామాలకు బీటి రోడ్లు మంత్రి ఆధ్వర్యంలో నెరవేరుతున్నాయని తెలిపారు. మక్తల్ – నారాయణపేట రోడ్డుకు నాలుగు లైన్ల రహదారి మంజూరు అయిందని, వేలాది కోట్ల రూపాయలతో మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పనులు జోరుగా సాగుతున్నాయని, ఉట్కూరు మండలానికి త్వరలోనే సాగునీరు అందబోతుందని తెలిపారు. దాదాపు 1800 కోట్ల రూపాయల నిధులు తీసుకువచ్చి మక్తల్ ను అభివృద్ధి చేస్తున్న ఘనత మంత్రి వాకిటి శ్రీహరికే దక్కిందని అన్నారు.

కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ వాకిటి మానస హనుమంతు, సీనియర్ నాయకులు కట్ట సురేష్ గుప్తా, మార్కెట్ వైస్ చైర్మన్ గణేష్ కుమార్, టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు అల్కూరి రవికుమార్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ వార్డు కౌన్సిలర్లు, కో ఆప్షన్ నెంబర్లు, మార్కెట్ డైరెక్టర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *