–అధికారుల సమన్వయ సమావేశంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను
నారాయణపేట, సెప్టెంబర్ 2 (జన ఉదయం ప్రతినిధి)
ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ఈ నెల 4న మద్దూరు మండల కేంద్రంలో పర్యటించనున్న నేపథ్యంలో పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా, ఎలాంటి లోటుపాట్లు లేకుండా పూర్తి చేయాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను సంబంధిత అధికారులను ఆదేశించారు.
బుధవారం జిల్లా కలెక్టరేట్‌లోని వీసీ హాల్‌లో ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. పర్యటనలో భాగంగా మద్దూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో ఏర్పాటు చేస్తున్న హెలిప్యాడ్, అక్కడి నుంచి డిగ్రీ కళాశాలకు వెళ్లే మార్గాన్ని అధికారులు పరిశీలించి, అవసరమైన రహదారి మరమ్మతులు, పారిశుద్ధ్య పనులు, పొదలు, చెత్త తొలగింపు తదితర పనులను వెంటనే పూర్తి చేయాలని సూచించారు. డిగ్రీ కళాశాల నిర్మాణ పనుల పరిశీలన అనంతరం
ముఖ్యమంత్రి సందర్శించనున్న తెలంగాణ రెసిడెన్షియల్ విద్యాసంస్థల నిర్మాణ ప్రాంతానికి వెళ్లే మార్గాలను కూడా పరిశీలించి, రెండు ప్రత్యామ్నాయ మార్గాలను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. అవసరమైన చోట రహదారి అభివృద్ధి, పారిశుద్ధ్య పనులు చేపట్టాలని తెలిపారు.
పర్యటన సందర్భంగా ట్రాఫిక్ నియంత్రణ, భద్రత, పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్, రహదారులు, పార్కింగ్, బారికేడింగ్ తదితర ఏర్పాట్లను సంబంధిత శాఖలు పరస్పర సమన్వయంతో చేపట్టాలని సూచించారు. ప్రతి శాఖకు అప్పగించిన బాధ్యతలను నిర్దేశిత సమయంలో పూర్తి చేసి, పురోగతిని ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు తెలియజేయాలని ఆదేశించారు.
పర్యటనకు ముందు సీఎం సెక్యూరిటీ, పోలీసు ఉన్నతాధికారులు, ఇతర భద్రతా బృందాలు జిల్లాకు చేరుకునే అవకాశం ఉన్నందున పెండింగ్ పనులన్నింటినీ గురువారం ఉదయం నుంచే ప్రారంభించి సాయంత్రానికి పూర్తి చేయాలని అన్నారు. సీఎం భద్రతా అధికారులు, ఎస్ఎల్ బృందం అందించే సూచనల మేరకు రూట్, భద్రతా ఏర్పాట్లపై తక్షణ చర్యలు చేపట్టాలని తెలిపారు.
ముఖ్యమంత్రి మద్దూరు పర్యటన అనంతరం దౌల్తాబాద్, హకీంపేట్ తదితర ప్రాంతాలకు వెళ్లే మార్గాల్లో కూడా అవసరమైన రహదారి, భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. అదే రోజు హకీంపేట్‌లో నిర్వహించే కడ సమీక్షా సమావేశానికి సంబంధిత అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించారు.
గతంలో నిర్వహించిన ముఖ్యమంత్రి పర్యటనల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని అధికారులు సమన్వయంతో పనిచేయాలని, పర్యటన మొత్తం ఏర్పాట్లపై ఓవరాల్ సూపర్‌విజన్ చేపట్టే అధికారులు పరస్పరం సమన్వయం చేసుకుంటూ ప్రతి పనిని నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ శ్రీను సూచించారు.
ఈ సమావేశంలో డీఆర్వో రాజేశ్వరి, ఆర్డీవో రమేష్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి జయచంద్రమోహన్, మిషన్ భగీరథ ఈఈ రంగారావు, డీపీఆర్‌ఓ రషీద్, సంబంధిత జిల్లా, మండల స్థాయి అధికారులు, మున్సిపల్, పోలీసు, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.
