కళాశాల దశే విద్యార్థుల భవిష్యత్తుకు పునాది

• ఫ్రెషర్స్‌ డేలో ప్రిన్సిపాల్‌ ఈ. నారాయణగౌడ్‌

• ఆకట్టుకున్న విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు

నారాయణపేట, సెప్టెంబర్‌ 3 (జన ఉదయం ప్రతినిధి):

కళాశాల విద్యార్థి జీవితం భవిష్యత్తు నిర్మాణంలో అత్యంత కీలకమైన దశ అని మక్తల్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ ఈ. నారాయణగౌడ్‌ అన్నారు. విద్యార్థులు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ విద్యతో పాటు నైతిక విలువలు, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలని ఆయన సూచించారు.
మక్తల్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ద్వితీయ, తృతీయ సంవత్సరం విద్యార్థుల ఆధ్వర్యంలో గురువారం ఫ్రెషర్స్‌ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్‌ ఈ. నారాయణగౌడ్‌ అధ్యక్షతన జరిగిన కార్యక్రమం పండుగ వాతావరణంలో ఉత్సాహభరితంగా సాగింది. ముఖ్య అతిథులు, అధ్యాపకులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌ నారాయణగౌడ్‌ మాట్లాడుతూ.. ఉన్నత విద్య అనేది కేవలం పట్టా పొందేందుకు మాత్రమే కాకుండా వ్యక్తిత్వ వికాసానికి, సమాజంపై బాధ్యతను పెంపొందించుకోవడానికి ఉపయోగపడాలని అన్నారు. సీనియర్‌, జూనియర్‌ విద్యార్థులు పరస్పరం సహకరించుకుంటూ స్నేహభావంతో మెలగాలని, కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు. కొత్తగా కళాశాలలో చేరిన విద్యార్థులు తమ ప్రతిభను అభివృద్ధి చేసుకునేందుకు అందుబాటులో ఉన్న విద్యా, సాంస్కృతిక, క్రీడా అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఫ్రెషర్స్‌ డే సందర్భంగా సీనియర్‌ విద్యార్థులు ప్రథమ సంవత్సరం విద్యార్థులను సాదరంగా ఆహ్వానించారు. అనంతరం విద్యార్థుల పరిచయ కార్యక్రమాలు, వినోదభరితమైన పోటీలు, సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. విద్యార్థులు ప్రదర్శించిన శాస్త్రీయ నృత్యాలు, జానపద నృత్యాలు, సినీ గీతాల ఆధారిత నృత్యాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. పలువురు విద్యార్థులు పాటలు, ప్రసంగాలు, ఇతర కళా ప్రదర్శనలతో తమ ప్రతిభను చాటుకున్నారు.
కార్యక్రమం ఆద్యంతం విద్యార్థుల కేరింతలు, చప్పట్లతో కళాశాల ప్రాంగణం సందడిగా మారింది. కొత్తగా చేరిన విద్యార్థులకు సీనియర్లతో పరిచయం ఏర్పడటంతో పాటు, కళాశాల వాతావరణంపై అవగాహన కలిగేలా వేడుకలు దోహదపడ్డాయి. కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడంపై అధ్యాపకులు విద్యార్థులను అభినందించారు.
ఈ కార్యక్రమంలో అధ్యాపకులు హరిశ్చంద్ర, తిరుపతి, బాలరాజ్‌, నర్సోజి, మహేష్‌, సులోచన, రాజేశ్వరి, నాగేంద్రమ్మ, దివ్య, నాగమణి, బాలమణి, బోధనేతర సిబ్బంది ప్రదీప్‌కుమార్‌తో పాటు పెద్ద సంఖ్యలో విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *